మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తవ్వకాలు చేపడుతుండగా మట్టి పెళ్లలు పడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చెదళ్ళ చెరువులో ఇటీవల ఇసుక తవ్వకాలను చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా పై నుంచి మట్టి పెళ్లలు పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వారిపై మట్టి పెళ్లలు ఎక్కువగా పడటంతో జెసిబి సాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతులు చెదళ్ళ గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి భార్య జ్యోతమ్మ(37), వెంకటరమణ కుమారుడు బి.అనిల్(23), ఎల్.రామయ్య కుమారుడు లక్కోళ్ళ కృష్ణప్పగా గుర్తించారు. వీరంతా వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకే గ్రామంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జెడ్‌పిటిసి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
