సినీ ఇండస్ర్టీలో నిర్మాతగా కొనసాగడం అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ.. చిన్న సినిమాలకు సైతం ప్రాణం పోస్తూ ఏళ్ల తరబడి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఉండటం నిజంగా గొప్ప విషయమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కోవకే చెందుతాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాదు.. కాదు.. ఒప్పుకుంటున్నారు.
రెండు, మూడేళ్లపాటు సరైన హిట్లులేక భారీ నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజు గతేడాది వరకు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో దిల్‌రాజు సుమారు రూ.40 కోట్లకు పైగా నష్టాలను చవిచూశాడు కూడా. గత సంవత్సరం వచ్చిన సుప్రీమ్ సినిమా తరువాత దిల్ రాజు మళ్లీ లాభాలను చూడటం మొదలు పెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన కిక్‌తో, ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన శతమానం భవతి సినిమాతో తన విజయపరంపరను కొనసాగించిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఆ తరువాత నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్ చిత్రంతో మరో హిట్‌ను తనఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన (డీజే) దువ్వాడ జగన్నాథమ్ చిత్రానికి మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా.. నిర్మాతగా మాత్రం దిల్‌రాజుకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. సాయిపల్లవిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ వరుణ్‌తేజ్ హీరోగా దిల్‌రాజు తన సొంత బేనర్‌లో తెరకెక్కిన ఫిదా సినిమా దిల్‌రాజుకు భారీ లాభాలనే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. మాస్ రాజా రవితేజ లాంగ్ గ్యాప్ తరువాత నటించిన రాజా ది గ్రేట్ మూవీతో దిల్‌రాజు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి గత సంవత్సరం ఇదే సమయానికి రూ.40 కోట్ల మేర నష్టాలను చవిచూసిన దిల్‌రాజు. ఈ ఏడాది సుమారు రూ.80 కోట్లు లాభాల్ని రాబట్టినట్లు సమాచారం.
ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ.. మరో వైపు చిన్న చిత్రాలకు ప్రాణం పోస్తూ, కొత్త కొత్త నటులను వెండి తెరకు పరిచయం చేస్తూ అటు స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదగడమే కాకుండా… ఇటు తాను అందరివాడినని నిరూపించుకుంటున్నాడు నిర్మాత దిల్‌రాజు.