ప్రజల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిని పథకాలను ప్రవేశపెడుతూ, తెలంగాణ ఉద్యమం సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు.. మీకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తూ తన పాలనాదక్షతను చాటుతున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మెప్పించేలా నిర్ణయాలు తీసుకుంటూ, ఒక వైపు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మరో వైపు రైతుల సంక్షేమం, వారిని ధనవంతులుగా చూడాలన్న తన లక్ష్యం వైపు ఏ నాడో అడుగులు వేశారు కూడా. ఆ లక్ష్యంవైపు అడుగులు వేగంగా పడుతున్న వేళ కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్.
సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్తు దేశం హర్షించింది. తెలంగాణ రైతాంగంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ నిర్ణయం అమలుకు అడ్డంకిగా ఉన్న ఆటో స్టార్టర్లను ప్రతీ రైతు తొలగించాలన్న సీఎం కేసీఆర్ పిలుపుకు రైతులు తమ మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ ఏది చేసినా మా మంచికేనంటూ ఆటో స్టార్టర్లను తొలగిస్తున్నారు రైతులు.
అందులో భాగంగా మంత్రి హరీష్ రావు తన సొంత నియోజక వర్గమైన సిద్దిపేటలో పర్యటించారు. ఈ క్రమంలో మంత్రి జిల్లా వ్యాప్తంగా ఆటో స్టార్టర్లను తొలగించాలని పిలుపునిచ్చారు. దీంతో సిద్ధిపేట రూరల్ మండలంలో బంజేరుపల్లి గ్రామానికి చెందిన రైతన్నలు స్పందించారు. వెంటనే గ్రామంలో ఉన్న మొత్తం రైతన్నలు తమ పొలాల్లో ఉన్న ఆటో స్టార్టర్లను తొలగించి యావత్తు రాష్ట్రంలోనే తొలి గ్రామంగా రికార్డును సొంతం చేసుకున్నారు .మంత్రి హరీష్ పిలుపుతో ఆటో స్టార్టర్లను తొలగించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు .