తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఈ వాక్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. అలాగే సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేయాలని ఆయన కోరారు. విద్యుత్ లేని ప్రపంచాన్ని ఊహించలేమన్నారు. అభివృద్ధిలో విద్యుత్ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. సోలార్ విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్లు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్‌లో ఘనత సాధించినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు.