తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం 36 నెలల్లో 365 సంక్షేమ పథకాలు రచించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆశీస్సులు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిండు మనస్సుతో సీఎం కేసీఆర్ కు దీవెనలు ఇవ్వాలని కోరారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజక్ట్ నుంచి సాగునీటిని అందించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.వచ్చే జనవరి చివరికల్లా దేవాదుల పంపులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి కాలువ ద్వారా ఘన్పూర్ కు కాళేశ్వరం నీళ్ళు పారతాయన్నారు. స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో ఇటు దేవాదుల, అటు కాళేశ్వరం నుంచి మొత్తం 1 లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరందు తుందని మంత్రి తెలిపారు.దేవాదుల పంపులు 365 రోజులు నడిచేలా ప్రణాళిక అమలు చేయనున్నట్టు చెప్పారు. ఆదివారం నాడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని ఇప్పగూడెం దగ్గర నాగుల చెరువు ఫీడర్ ఛానల్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.8.25 కిలోమీటర్ల పొడవైన ఈ ఫీడర్ ఛానల్ పనులను 4 కోట్ల 45 లక్షలతో మిషన్ కాకతీయ 4వ దశ కింద చేపడుతున్నారు.
నాగులచెరువు ఫీడర్ ఛానల్ నుంచి 27 చెరువులను నింపనున్నారు.నాలుగు నెలల్లో ఈ పనులను పూర్తి చేసి 2400 ఎకరాలకు సాగునీటిని అందించాలని ఇరిగేషన్ అధికారయంత్రాంగాన్ని మంత్రి హరీశ్ రావు కోరారు.ఒప్పందం ప్రకారం 2018 సెప్టెంబర్ లో తుపాకులగూడెం పూర్తి కావలసి ఉందని, అయితే జాప్యం జరిగినా ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టామని హరీష్ రావు చెప్పారు. 72 మీటర్ల ఎత్తు దగ్గర షీట్ ఫైల్స్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు.ప్రత్యామ్నాయ చర్యలతో 2018 యాసంగిలో సాగునీటిని అందించగలుగుతామని ఆయన చెప్పారు.నెలకు 6 టి.ఎం.సి.ల చొప్పున 10 నెలల పాటు 60 టి.ఎం.సి. ల నీటిని స్టోరేజ్ చేసుకునే విధంగా తుపాకులగూడెంను ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ చేశారని మంత్రి తెలిపారు.రీ ఇంజనీరింగ్ వల్ల దేవాదుల ప్రాజెక్టు నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని హరీష్ రావు తెలియజేశారు.
దేవాదుల లిఫ్ట్ 3 పథకం పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ లిఫ్ట్ పనులు తుపాకులగూడెం లో కీలకమని ఇరిగేషన్ మంత్రి అన్నారు.ప్రతి ఊరికి కాలువల ద్వారా నీలివ్వాలన్నది సి.ఎం.లక్ష్యమని హరీశ్ రావు చెప్పారు.కోటి ఎకరాల మాగాణి కేసీఆర్ కల అన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వల్ల గత సంవత్సరం 5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చిందని, భారీ, మధ్య తరహా ప్రాజెక్టు ల్ ద్వారా మరో 9 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని ఇరిగేషన్ మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు చెరువులను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.జనవరి 1 వ తేదీ నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నందున నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ పంపుసెట్లకు వాడుతున్న ఆటోమేటిక్ స్టార్టర్ లను తొలిగించుకొని భూగర్భ జలాలు కాపాడుకోవాలన్నారు. చేతికందిన పంటలు ఎండిపోకుండా చూడాలని రైతులను హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ.లు డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి, ఎం.ఎల్.సి.బి.వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.