“ఏ గతి రచియించినను సమకాలీనులు మెచ్చరే ” అని విజయవిలాసం గ్రంధకర్త చేమకూర వెంకట కవి వాపోయారు. మనం ఎంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించినా, ఎన్ని కావ్యాలను రాసినా, ప్రపంచం మొత్తం మనను ప్రశంసించినా, మన సాటి సాహిత్యవేత్తలు అభినందించరు. ఆ జాడ్యం అప్పుడూ ఇప్పుడూ ఉన్నది. ఒక కవి, రచయిత రాసిన సాహిత్యాన్ని మరో కవి, రచయితలు చదవడం అరుదు. పుస్తకానికి ముందు మాట రాసివ్వమని ఎవరైనా సీనియర్ కవిని కోరితే, పైపైన రెండో, మూడో కవితలు చదివి, పొడిపొడి మాటలు రాసే కవులు ఎక్కువ మనకు.
ఇక పెద్ద పెద్ద పదవులలో ఉండేవారు తమ స్థాయికంటే చాలా చిన్నవారి పేర్లను పదిమందిలో పలకాలన్నా నామోషీగా భావిస్తారు. అసలు తాము వారి సభకు వెళ్లడమే అవ్వారి పూర్వజన్మ సుకృతం అన్న పోజులు కొడతారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న శ్రీ కె చంద్రశేఖర రావు తెలుగు మహాసభల ప్రారంభోపన్యాసంలో నేటితరం కవులు అందెశ్రీ, గోరెటి వెంకన్న లాంటి కవుల పేర్లను ప్రస్తావించడమే కాక, వారి కవితలను కూడా ఆలపించడం ఎంత గొప్ప విషయం! నిజానికి ముఖ్యమంత్రి స్థాయికి వారు చాలా చిన్న స్థాయి వారు. అయినప్పటికీ, ఏమాత్రం భేషజం లేకుండా వారి పేర్లను కూడా బహిరంగవేదికమీద, పెద్దల సమక్షంలో కేసీయార్ పలుకుతూ ప్రశంసించడం ఒక్క కేసీయార్ కె సాధ్యమేమో! ఆ కవులకు కలిగే మానసిక సంతోషానికి ఎల్లలు ఉంటాయా?
ఇక తెలంగాణాలో సాహిత్య బృందావనాలకు లోటేముంది? ముఖ్యమంత్రి కేసీయార్ కు, గోరెటి వెంకన్న, అందెశ్రీలకు అభినందనలు.
సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన రావు గారు