తాను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్‌రూమ్‌లోకి తొంగి చూశారు. ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్‌కు గురిచేసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం కల్గించింది.
అసలే ఏం జరిగిందంటే…క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భన్వరీలాల్ పురోహిత్‌కు వండిపాళెయం వద్ద రోడ్డు పక్కనే ఓ కాలనీ కనిపించింది. ఆ కాలనీని తనిఖీ చేయాలనుకున్న గవర్నర్ తన వాహనాన్ని ఆపాలని డ్రైవర్‌ను ఆదేశించారు. గవర్నర్ వాహనం ఎందుకు ఆగిందో పోలీసులు తెలుసుకునేలోగానే వాహనం దిగిన భన్వరీలాల్.. హూటాహూటీన కాలనీలోని ఓ మరుగుదొడ్డి వద్దకు వెళ్లారు. ఆ మరుగుదొడ్డి పక్కనే మరో తడికెల దొడ్డి ఉండటంతో అటువైపు తొంగి చూశారు. ఆ తడికెల దొడ్డిలో ఓ మహిళ స్నానం చేస్తున్న మహిళ కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
దీన్ని గమనించిన ఆ మహిళ… ఎవరో వృద్ధుడు వచ్చాటూ కేకలేస్తూ తడికెపైనున్న చీరను గబగబా శరీరానికి చుట్టుకుని ఇంట్లోకి పారిపోయింది. అసలు విషయాన్ని గ్రహించిన గవర్నర్ సిబ్బంది.. అక్కడున్న పోలీసులపై చిందులేశారు. దీంతో పోలీసులు కూడా వారితో వాగ్వివాదానికి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడపడితే అక్కడ వాహనం ఆపి తనిఖీ చేస్తే తామేం చేయగలమని వారు నిలదీయడంతో రాజ్‌భవన్ సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. గవర్నర్ చర్యకు షాక్ తిన్న మహిళ కాసేపటికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించిన గవర్నర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో గవర్నర్ వెంట కడలూరు కలెక్టర్, అధికార ఏఐడీఎంకేకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారు. మరోవైపు గవర్నర్ పర్యటనను నిరసిస్తూ ప్రతిపక్ష డీఎంకే కడలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది. ఆరోపణలను ఖండించిన రాజ్‌భవన్ మహిళ చేసిన ఆరోపణలపై తమిళనాడు రాజ్ భవన్ తీవ్రంగా ఖండించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్ భవన్ అభిప్రాయపడింది.