ఏపీలో పాదయాత్రతో బిజీగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రస్తుతం టీడీపీ కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో తన పాదయాత్రని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 36వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర.. శనివారం ధర్మవరం నియోజకవర్గం ఉప్పునేని పల్లి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డుమీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది.
ఇక ధర్మవరం విషయానికి వస్తే.. ఆ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గోనుగుంట్ల సూర్యనారాయణ వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి పై ఘన విజయం సాధించారు. గోనుగుంట్ల తన ప్రత్యర్థి కేతిరెడ్డిపై 2014 ఎన్నికల్లో 14,211 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ధర్మవరం నియోజకవర్గం లో 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలిచారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి విజయం సాధించారు. 2004 వైఎస్ ప్రభంజనం రాష్ట్రమంతటా వీచినా ధర్మవరంలో మాత్రం టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల జయలక్ష్మమ్మ విజయం సాధించారు. అయితే తిరిగి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామారెడ్డి విజయం సాధించారు. తిరిగి 2014 ఎన్నికల్లో ధర్మవరాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. ఈసారి ఎలాగైనా ధర్మవరాన్ని దక్కించుకోవాలని జగన్ ఈ నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించారు. మరి ధర్మవరంలో జగన్ పాదయాత్ర సక్సెస్ అవుతుందా.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరాన్ని జగన్ పార్టీ దక్కించుకుంటుందా.. అనేది తేలాలంటే.. ఎన్నికల వరకు ఆగాల్సిందే.