మనదేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 2వేల రూపాయల వరకూ జరిపే నగదు రహిత లావాదేవీల పై విధించే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను కేంద్రమే భరించాలని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. డెబిట్ కార్డు, యూపీఐ, భీమ్, ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై.. అది కూడా 2వేల లోపు జరిగే క్రయవిక్రయాలపై ఎండీఆర్ చార్జీలను కేంద్రమే చెల్లిస్తుంది. వినియోగదారుడిపై ఎలాంటి చార్జీల భారం పడదు. వినియోగదారులకు ఇది కొంత ఊరట కలిగించే విషయమే. డెబిట్, క్రెడిట్ కార్డు సేవలను అందించినందుకు గానూ బ్యాంకులు ఖాతాదారుల నుంచి ఈ ఎండీఆర్ చార్జీలను వసూలు చేస్తాయి.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం.. నోట్ల వాడకం తగ్గడం ద్వారా నగదు చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుందనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నగదు రహిత లావాదేవీలను భారత్‌లో అమలు చేయాలన్న ప్రధాని మోదీ చేసిన ప్రయత్నానికి ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటికీ నగదుతోనే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల వారీకి నగదు రహిత లావాదేవీలపై అంతగా అవగాహన లేకపోవడం, ఇతర కారణాల వల్ల అనుకున్న స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరగడం లేదు. దీంతో ఎలాగైనా డిజిటల్ లావాదేవీలను పెంచి.. దేశంలో నోట్ల వినియోగాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఏ స్థాయిలో జరిగాయన్న దానిపై కేంద్రం అధ్యయనం చేసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు పలువురు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం కొద్ది నెలలుగా డిజిటల్ లావాదేవీలు తగ్గి.. నోట్ల వినియోగం పెరిగినట్లు తేలింది.