రాష్ట్రపునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుచేయాలని కేంద్రవూపభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. దీంతోపాటు రాష్ట్ర అసెంబ్లీ ఏకవూగీవంగా చేసిన తీర్మానాల అమలుపైనా పట్టుబట్టనుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరి, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు కసరత్తు చేశారు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను ఆరునెలల్లో అమలుచేస్తామని చెప్పిన కేంద్రం మూడున్నరేండ్లు గడిచినా వాటిఊసే ఎత్తడంలేదు. హైకోర్టు విభజన, కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కుకర్మాగారం, ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయం, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, బుల్లెట్ ట్రైన్ అంశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు.
ఏపీలో పోలవరం ప్రాజెక్టును జాతీయవూపాజెక్టుగా ప్రకటించిన కేంద్రం తెలంగాణలోనూ ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటినుంచో కోరుతున్నది. దీంతోపాటు, కాళేశ్వరం, పాలమూరు-రంగాడ్డి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఎంపీలు కోరుతున్నారు. ‘రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనేదే టీఆర్‌ఎస్ ప్రధాన డిమాండ్.. కొత్తగా మేమేమీ అడగడంలేదు. మూడున్నరేండ్లు పూర్తయినా కేంద్రానివి మాటలు తప్ప చేతలు కన్పించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలు చేసింది. వాటన్నింటినీ వెంటనే అమలుచేయాలి’ అని ఎంపీ వినోద్ అన్నారు.