పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుమాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ వ్యాఖ్యానించారు. పంజాబ్ మోడల్ తరహాలో తెలంగాణలో రిజర్వుడు నియోజకవర్గాలన్నిటిలో గెలుస్తామని దళిత, గిరిజనులను ఉత్తమ్ అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలవడానికి ఇది పంజాబ్ కాదని..తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం టీడీఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆదివాసీలు ,లంబాడాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఎక్కడ కాలు మోపితే అక్కడ కాంగ్రెస్ గల్లంతేనని రాములు నాయక్ ఎద్దేవా చేశారు. ఉత్తమ్, రాహుల్ గాంధీ లు కాంగ్రెస్ పాలిట ఐరన్ లెగ్‌లని ఎద్దేవా చేశారు. 31 రిజర్వుడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డిపాజిట్ లు దక్కించుకుంటే అదే గొప్ప అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనలో దళిత గిరిజనులు అభివృద్ధి కావడాన్ని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని మండిపడ్డారు. అధికారంపై కాంగ్రెస్ నేతలు పగటి కలలు మానాలన్నారు. 2019 కాదు గదా 2024 లో కూడా కాంగ్రెస్ కు అధికారం రాదని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీయే కాదు రాజీవ్ గాంధీ వచ్చినా కాంగ్రెస్ ను బతికించ లేరన్నారు.
29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సీఎం కెసిఆర్ తెలంగాణ ను అభివృద్ధి చేస్తున్నారని రాములు నాయక్ స్పష్టం చేశారు. దళిత గిరిజనులను డబ్బుతో కాంగ్రెస్ కొనలేదని తేల్చిచెప్పారు. తండాలకు కాంగ్రెస్ నేతలు వస్తే తరిమి కొట్టే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. గుజరాత్, హిమచల్ ప్రదేశ్ ల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓటమి ఖాయమని అన్నారు.