సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మినీట్యాంక్ బండ్-కోమటి చెరువు కట్టపై రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శుక్రవారం మార్నింగ్ వాక్ చేశారు. కోమటి చెరువు సుందరీకరణ పనులపై మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, తహశీల్దారు పరమేశ్వర్, మంత్రి ఓఎస్డీ బాలరాజులను ఆరా తీశారు. ఈ మేరకు మినీట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, రోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ అసంపూర్తి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయించాలని మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సుకు సూచించారు.
రాష్ట్రానికే ఆదర్శంగా దిక్సూచిగా నిలిచిన మిషన్ భగీరథ కార్యక్రమం సీఎం కేసీఆర్ నేతృత్వంలో సిద్ధిపేట నియోజకవర్గం నుంచే ప్రారంభమైనదని, ఇందుకు చిహ్నంగా కోమటి చెరువు కట్ట సమీపంలో మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నట్లు, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో దానికి కావాల్సిన డిజైన్ మ్యాపులు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కోమటి చెరువు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. మినీట్యాంక్ బండ్ సుందరీకరణలో భాగంగా అడ్వేంచర్ పార్క్, రాక్ గార్డెన్, ఓపెన్ ఏయిర్ ఆడిటోరియం, రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా మొట్టమొదటి దోభిఘాట్ నిర్మాణాల పురోగతి పనులపై మున్సిపల్ ఛైర్మన్, ఓఎస్డీలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నిత్యం సమీక్షించి పనులు పూర్తి చేయించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.