టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. 1985లో ఇద్దరం ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, మంచి మిత్రులమన్నారు. ఆనాడు వ్యవసాయ కనెక్షన్లకు కరెంట్ చార్జీలు పెంచాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే తాను వ్యతిరేకించానని, మంత్రివర్గంలో చివరి వరకు తనతో నిలిచిన వ్యక్తి మాధవరెడ్డి అని కొనియాడారు. మాధవరెడ్డి హత్యకు గురయ్యారని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదని భావించి ఆనాడు తాను ఉద్యమం ప్రారంభించానని వివరించారు.
నల్గొండ జిల్లా నుంచి గతంలో చాలామంది మంత్రులయ్యారని, జిల్లా మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు పట్టించుకున్న ఏకైక నాయకుడు మాధవరెడ్డి అన్నారు. ఉమా మాధవరెడ్డి ఆ వారసత్వం కొనసాగించారని ప్రశంసించారు.మాధవరెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీరేశం, కిశోర్, శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.