ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే ప్రతినిధులకు పుస్తకాల కిట్లను నేటి నుంచి రవీంద్రభారతి ప్రాంగణంలో పంపిణీ చేస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 2000 మంది ప్రతినిధులకు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కిట్‌లను అందజేస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చేవారు నగరానికి చేరుకుని ఉంటే.. వాళ్లు కూడా రవీంద్రభారతిలో కిట్‌లను పొందవచ్చని, శుక్రవారం మధ్యాహ్నం వరకు రవీంద్రభారతిలో కిట్‌లను అందజేస్తారని చెప్పారు. ప్రతినిధులు తమ వద్ద ఉన్న స్లిప్పు, వరుస సంఖ్య చెబితే చాలు.. కిట్ అందజేస్తారన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు.. వాళ్లు బస చేసే హోటళ్లలోనే కిట్‌లను అందజేస్తారు. సుమారు 8 వేల మంది ప్రతినిధులు, మరో 1,500 మంది అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు మహాసభల్లో పాల్గోనున్నారు.
