పవన్ కల్యాణ్ రాజకీయంపై ప్రొఫెసర్ నాగేశ్వర ఘాటైన విశ్లేషణ చేశారు. పవన్ కల్యాణ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ తాజా పర్యటనలో కొత్తదనం ఏమీ లేదన్నారు. మీడియా హడావుడి మాత్రమే ఉందన్నారు. పవన్ కల్యాణ్ వీడియోలు య్యూటూబ్‌లో అప్‌లోడ్ చేస్తే లక్ష మంది చూస్తారన్న ఉద్దేశంతోనే మీడియా సంచలనం చేస్తోందన్నారు.విరామం ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయ తీర్థ యాత్రలు చేస్తున్నారని నాగేశ్వర్ విమర్శించారు. ప్రతిపక్షంపై రాళ్లేయడం బాగానే ఉంది గానీ.. అసలు ప్రశ్నించాల్సిన అధికార పార్టీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ లాబీయిస్ట్‌గా పనిచేస్తున్నట్టుగా ఉందన్నారు. తనకు సీఎం పదవి వద్దని పదేపదే పవన్ కల్యాణ్ చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. క్రికెట్ ఆడుతాను కానీ… గెలుపు మాత్రం తనకు అవసరం లేదన్నట్టుగా పవన్ తీరు ఉందని విమర్శించారు.
అధికారం లేకున్నా రాజకీయాలు చేయవచ్చంటున్న పవన్ వ్యాఖ్యలపైనా నాగేశ్వర్ స్పందించారు. జగన్, కమ్యునిస్టులు పోరాటం చేస్తున్నా చంద్రబాబు స్పందించడం లేదన్నారు.చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అస్మదీయుడిగా ఉన్నాడు కాబట్టే ఆయన లేవనెత్తే సమస్యలకు చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఒకసారి టీడీపీకి ఎదురుతిరిగితే పరిస్థితి మరోలా ఉంటుందన్నారు.వచ్చే ఎన్నికల్లో తనను బీజేపీ పక్కన పెడితే పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లేలా చంద్రబాబు ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకుని ఉండవచ్చని నాగేశ్వర్ చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తానంటూ ప్రతిపక్షాన్ని ప్రశ్నించి.. అధికార పార్టీని విమర్శించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ బాగా పనిచేస్తోందని పవన్ కల్యాణ్ చెప్పిన తర్వాత జనసేన అధికారపక్షంలో భాగమవుతాడు గానీ… ఆయనది ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఎలా అవుతుందని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.
అధికారం అవసరం లేదన్నప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు? స్వచ్చంద సంస్థను పెట్టుకుంటే సరిపోతుందన్నారు. జనసేన అంటే సైన్యం జనం కోసం పనిచేయాలి గానీ… జనం కోసం ప్రభుత్వంతో లాబీయింగ్ చేస్తామంటే ఎలా అని వ్యాఖ్యానించారు. ఇదే వైఖరిని పవన్ కల్యాణ్ అనుసరించాలనుకుంటే… జనసేన పేరుకు బదులు జనరాయబారి అని పెట్టుకుంటే బాగుంటుందని నాగేశ్వర్ సలహా ఇచ్చారు.
కొత్త తరహా రాజకీయం అంటూనే పీఆర్పీని మోసం చేసి తన అన్నను దెబ్బతీసిన వారిపై ప్రతికారం తీర్చుకుంటా అనడం ఏమిటని నాగేశ్వర్ ప్రశ్నించారు. పీఆర్పీ సమయంలో చిరంజీవిని మరొకరు మోసం చేశారా… లేక ఆయనే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేసి అందరినీ మోసం చేశారా అన్నది కూడా ఆలోచించుకోవాలన్నారు. వైఎస్, చంద్రబాబు లాంటి రెండు మదగజాల మధ్య పీఆర్పీ నలిగిపోయిందన్న చిరంజీవి చివరకు అందులోని ఒక మదగజంపై ఎక్కేశారని విమర్శించారు.
2019 ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా అభిమానులకు పవన్ చెప్పడం.. పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండానే పెళ్లికి సిద్ధంకండి అన్నట్టుగా ఉందన్నారు. ఏపీలో ధనరాజకీయాలు చేస్తున్నారని .. అవి పోవాలంటున్న పవన్ కల్యాణ్.. ఆ ధనరాజకీయాలు చేస్తున్నది ఎవరో మాత్రం చెప్పకపోవడం ఏమిటని నిలదీశారు నాగేశ్వర్. ప్రజల
తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో…. లేదంటే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటారో పవన్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారాలనుకుంటే మాత్రం ఈ తరహా వైఖరితో సాధ్యం కాదని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.