రాప్తాడు నియోజక వర్గంలోని పాపంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రకాశ్ రెడ్డి… పల్లెల్లో రైతులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది అని విమర్శించారు. తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని పరిటాల సునీతను ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం దౌర్జన్యాలు ఇక ఎంతో కాలం సాగవన్నారు జగన్ పాదయాత్రలో భాగంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. త్వరలోనే ప్రజా ప్రభుత్వం రాబోతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ పరిటాల కుటుంబం దౌర్జన్యాలు ఎన్నోరోజులు సాగవని పరిటాల కుటుంబం గుర్తించుకోవాలన్నారు. మంత్రి పరిటాల సునీత నాయకత్వంతో యదేచ్చగా లూటీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు బంధువులను సామంతరాజులుగా నియమించి… దళితులు, బీసీలు, పేదల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు నిర్మించుకోవాలన్నా పరిటాల కుటుంబం నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. వైసీపీ సర్పంచ్‌లను నిత్యం బెదిరిస్తున్న మాట వాస్తవం కాదా అని పరిటాల సునీతను ప్రశ్నించారు. నియోజకవర్గంలో చదువుకున్న వారు, ఉద్యోగులు,పేదలు, దళితులు అంతా వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
