సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన రావు గారు
—————————-—————————-———
వారానికో, పదిరోజులకో తనగురించి ఒక పోస్టింగ్ పెట్టకుండా ఉండలేని పరిస్థితులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు కల్పిస్తారు అని గతంలో నాలుగైదు సార్లు రాసినట్లు గుర్తు. మళ్ళీ ఈరోజు రాయకుండా ఉండక తప్పడం లేదు.
హోమ్ గార్డు అనే పోస్ట్ అటు కానిస్టేబుల్ కు కాదు ఇటు కాకుండా పోదు. మొదటినుంచి వారికి వేతనాలు చాలా తక్కువ. నాకు తెలిసి పాతికేళ్ల క్రితం రెండు మూడు వందల రూపాయలు కూడా ఉండేది కాదు. నాలుగేళ్లక్రితం వరకు రెండువేలో, మూడువేలో ఉండేది. వీళ్ళు నిర్వహించే విధులు సాధారణ కానిస్టేబుళ్ళకంటే తక్కువేమి కాదు. వీరి ఉద్యోగాలకు భద్రతా లేదు. వీరిని పోలీసులు అనడానికి లేదు. వేతనాలు తక్కువ కావడంతో వీరు ట్రాఫిక్ విధులు నిర్వహించేటపుడు వాహనదారుల పట్ల దురుసుగా వ్యవహరించడం, కేసులు రాయకుండా అంతో ఇంతో గిల్లుకోవడం, లంచాలకోసం వీరిని సాధనాలుగా అధికారులు ఉపయోగించుకోవడం, కొన్నిచోట్ల ఇంటిపనులు కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఎంత చూసినా రోజుకు పది పన్నెండు గంటలు వీళ్ళు విధులు నిర్వహించాలి. ఎంత కష్టపడినా వీరికి అధికారులనుంచి, ప్రభుత్వం నుంచి మెచ్చుకోళ్ళు లభించవు. నిర్మొగమాటంగా చెప్పాలంటే హోమ్ గార్డులు వేతనాలు తీసుకునే బానిసలు.
అలాంటి హోమ్ గార్డుల వేతనాలను ఒకేసారి పన్నెండువేల నుంచి ఇరవై వేలరూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించి ఆ వ్యవస్థను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బహుశా వారు కూడా ఊహించి ఉండరు. నిజాయితీపరుడైన డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారు ఆ పదవిలో ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు. జీతాలే కాక మహిళా హోమ్ గార్డులకు ఆరునెలల ప్రసూతి సెలవులు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం మహిళా ఉద్యోగులను ఆనందాంబుధిలో ముంచెత్తుతుంది అనడంలో సందేహం లేదు. వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు కానీ, అది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు.
ఈరోజుల్లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు పన్నెండు నుంచి పదిహేను వేలు ప్రారంభ వేతనంగా ఉంటున్నది. వారికంటే ఉన్నతస్థాయి వేతనాలను ఇస్తామని చెప్పడం ద్వారా ఆ చిరుద్యోగులలో ఎనలేని ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానాన్ని కలిగించారు కేసీయార్. పనికి తగిన వేతనాలు ఇస్తే ఉద్యోగులు విశ్వాసంతో పనిచేస్తారు. ఆ మర్మం గెలిసిన యోగ్యుడు కేసీయార్. అందుకే ఆయన పాలనలో ఉద్యోగుల పంట పండుతుంది.
ప్రజలకు, ఉద్యోగులకు మేలు చెయ్యాలి అనే మనసున్న పాలకుడు ఎప్పుడూ బడ్జెట్లు, ఖజానాను చూసుకోడు. తెగింపు ఉండాలి. ఆ తెగింపు లేకపొతే కీలక పదవులకు పనికిరారు. పదవులు శాశ్వతం కాదు. ప్రజల హృదయాల్లో నిలిచిపోవడమే ప్రధానం. తాను జల్సాలు చేస్తూ ఉద్యోగులను ఏడిపించేవాడు, డబ్బుల్లేవు అని బీద అరుపులు అరిచేవాడు ఎన్నటికీ ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకోలేడు.
హోమ్ గార్డులు ఇకనుంచి అయినా, ఉత్తమ ప్రవర్తన, క్రమశిక్షణ అలవరచుకుని, వాహనదారులను, పౌరులను గౌరవిస్తూ, వారిముందు చేతులు జాపకుండా గౌరవంగా తమ విధులు నిర్వహిస్తారని ఆశిస్తూ ఒకేసారి అరవై అయిదు శాతం పెరుగుదల పొందిన హోమ్ గార్డ్స్ కు అభినందనలు.
ముఖ్యమంత్రి అన్ని వర్గాల పట్ల ఇదే ఉదారవైఖరి అవలంబిస్తూ నాలుగుకాలాలు సువర్ణపాలన అందిస్తారని కోరుకుందాము.