గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పోటీ చేశాయి. నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటుధరలు, పాటీదార్ల రిజర్వేషన్లు, దళితులపై దాడులు, ఓబీసీ రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు 1828 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోడీ, యువనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుజరాత్‌లో గత ఎన్నికల్లో 115స్థానాలు బీజేపీ సాధించగా కాంగ్రెస్ 61 స్థానాలు, ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందారు. అయితే ఈసారి బీజేపీకి గెలుపు అంంత ఈజీ కాదనే చెప్పాలి. గుజరాత్ పోరు హోరా హోరీగా సాగిందని విశ్లేషణలు విన్పిస్తున్నాయి.
బీజీపీకి మరోసారి స్వల్ప సీట్ల తేడాతోనైనా అధికారం చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బీజేపీకి ఐదోసారి అవకాశం ఇవ్వాలని 45.9 శాతం మంది అభిప్రాయపడగా, కాంగ్రెస్ కే తాము మద్దతిస్తామని 44.1 శాతం మంది చెప్పడం విశేషం. రెండు పార్టీల మధ్య తేడా కేవలం 1.7 శాతం మాత్రమే కావడం విశేషం. అయితే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రూపానీ పనితీరు ఏమాత్రం బాగా లేదని 59. 2 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరవాలేదని 22 శాతం, బాగుందని 18.6 శాతం మంది మాత్రమే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక మాడియా సర్వేలు గమనిస్తే.. సహారా సమయ్ సర్వే ప్రకారం.. బీజేపీ 110 నుంచి 120 స్థానాలు గెలుపొందుతుందని సహారా సమయ్ చెబుతుంది. కాంగ్రెస్ కు 65 నుంచి 75స్థానాలు కైవసం చేసుకుంటుందని తేల్చింది. ఇతరులు రెండు నుంచి నాలుగు స్థానాలు గెలిచే అవకాశముంది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. బీజేపీకి 109 స్థానాలు, కాంగ్రెస్ కు 70 స్థానాలు దక్కుతాయని తేల్చింది. ఇతరులకు 3 స్థానాలు దక్కే అవకాశముంది. సీఓటర్ సర్వే ప్రకారం..బీజేపీకి 108 స్థానాలు, కాంగ్రెస్ కు 74 స్థానాలు దక్కుతాయని చెప్పింది.