నందమూరి బాలకృష్ణ ల్యాండ్ మార్క్ సినిమాగా విడుదలై, సంచలనం సృష్టించింది గౌతమీ పుత్ర శాతకర్ణి. తండ్రికి తగ్గ తనయుడిగా, అన్ని జానర్లలోనూ సినిమాలు చేసిన ఏకైక హీరోగా, బాలయ్య ఈ సినిమాతో ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగువారి ఘనచరిత్రను వెలికితీసి, ఒక అద్భుతమైన సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.
తెలుగు వారి తొలి చక్రవర్తి అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి గురించిన వాస్తవాలు మరుగున పడుతున్న సమయంలో, తిరిగి ఆ ఘనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను వెలికితీసి, ఎంతో శ్రమించి, వాస్తవాలను, శాసనాలను గుర్తించి ఒక కథ రూపంలోకి తీసుకొచ్చి, చక్కని సినిమాగా తెరకెక్కించారు క్రిష్ జాగర్లమూడి. ఒకరకంగా చాలా మంది తెలుగువారికి ఈ సినిమా వచ్చిన తర్వాతే శాతకర్ణి అనే తెలుగు చక్రవర్తి గురించి తెలిసింది. ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకున్న క్రిష్ ను, దాన్ని తన ల్యాండ్ మార్క్ సినిమాగా చేయడానికి సై అన్న నందమూరి బాలకృష్ణను తప్పకుండా అభినందించాల్సిందే.
ఇప్పుడున్న హీరోల్లో, పౌరాణికం,జానపదం, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ ఇలా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేసిన ఏకైక కథానాయకుడు బాలకృష్ణ మాత్రమే. అయితే, ఆయన అకౌంట్ లో చారిత్రక సినిమా అనే జానర్ ఒక్కటి మాత్రం ఇన్నాళ్లూ పడలేదు. గౌతమీ పుత్ర శాతకర్ణి ఆ లోటును పూడ్చేసింది. శాతకర్ణిగా బాలయ్యను తప్ప, వేరొకరిని ఊహించుకోలేనంతగా, ఆయన నటన సాగింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చోటుచేసుకున్న చరిత్రను, వీలైనంత వాస్తవికంగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ క్రిష్ అండ్ టీమ్ నూరు శాతం సక్సెస్ అయ్యారు.
అనేక రాజ్యాలుగా పడి ఉన్న భారతదేశాన్ని, ఏకతాటిపైకి తీసుకురావాలనే ఆశయంతో గౌతమీ పుత్ర శాతకర్ణి నడిపిన యుద్ధాలు, వీరోచిత పోరాటాల్ని కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించారు. ఇక బాలయ్యకు జోడీగా శ్రియ నటించగా, సినిమాకు కీలకమైన శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమమాలిని నటించారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి టాప్ హీరోలందరి సమక్షంలో, ఈ సినిమా ప్రారంభోత్సవమే ఒక పండుగలా జరిగింది. రాజస్థాన్ కోటల్లో, జార్జియా లాంటి దేశాల్లో షూటింగ్ జరుపుకుని జనవరి 12న విడుదలైంది గౌతమీ పుత్ర శాతకర్ణి.
సినిమా మొదటి షో నుంచే నందమూరి అభిమానులు బ్రహ్మరథం పట్టేశారు. ఇలాంటి సినిమా చేయడం కేవలం తమ బాలయ్యకు మాత్రమే సాధ్యం అంటూ అభిమానులందరూ ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇక సాధారణ అభిమానులకు కూడా ఈ సినిమా మంచి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించి 2017లో టాప్ 5 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.