టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్ లో చేరడం ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆమె తనకు తోబుట్టువుతో సమానమన్నారు.
టిఆర్ఎస్ లో చేరడానికి ఉమా మాధవరెడ్డి ఎలాంటి పదవులు అడగలేదని, అది ఆమె సంస్కారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు వీరు టిఆర్ఎస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఇవాళ ఓపిక చాలా తక్కువగా ఉందని, నేడు పార్టీలో చేరి రేపే పదవులు అడుగుతున్న వాళ్లు ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం వస్తుందో చెప్పలేమని చెప్పారు.
ఉమామాధవరెడ్డి, సందీప్‌రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.సందీప్‌రెడ్డికి మంచి అవగాహన శక్తి ఉందన్నారు . రాష్ట్రంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని వివరించారు. భువనగిరి నియోజకవర్గానికి పుష్కలంగా సాగునీరు, మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు ఇస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదాద్రి ఆలయం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. భువనగిరి జిల్లాకు ఐటీ, ఇతర పరిశ్రమలు వస్తున్నాయని, అంతర్జాతీయ ప్రమాణాలతో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.