బాహుబలి అన్న మాట గుర్తొచ్చినప్పుడు, అందరూ చెప్పే మాట ఒకటే. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అని. అది వాస్తవం. తెలుగు సినిమా అంటే దక్షిణాది సినిమా అని భావించే హిందీ ప్రేక్షకులకు, తెలుగు సినిమా అంటే ఇదిరా అని నిరూపించడమే కాక, భారతీయ సినిమా అంటే ఇది అని దేశదేశాల ప్రేక్షకులను తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిందీ సినిమా. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బాహుబలి చిత్రీకరణకు, రెండు భాగాలకు కలిపి రాజమౌళి ఏకంగా 4 ఏళ్లు టైమ్ తీసుకోవడం విశేషం.
తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, చూస్తే బాహుబలి చూడాలి అని తెలుగు ప్రజలు చెప్పుకునేలా ఈ సినిమా ఖ్యాతి ఖండాంతరాలు విస్తరించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో మొదటి భాగాన్ని సస్పెన్స్ లో వదిలేశాడు రాజమౌళి. జూలై 10, 2015న విడుదలైన బాహుబలి మొదటి పార్ట్ లో వేసిన ఆ ప్రశ్నకు సమాధానం కోసం ప్రేక్షకులు 2017 ఏప్రిల్ 28 వరకూ వేచి చూడాల్సి వచ్చింది. తనదైన అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగించి, సినిమాకు కనీసం పబ్లిసిటీ ఖర్చు కూడా లేకుండా, ఖండాంతరాల్లో బాహుబలిపై ఆసక్తిని కలిగించాడు.
రాజమౌళి నైపుణ్యం గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఫ్లాప్ అనేది లేని ఆయన ట్రాక్ రికార్డే ఆయన టాలెంట్ గురించి చెబుతుంది. ఇక బాహుబలితో, ఆయన మరో మెట్టు పైకెక్కారు. గ్రాఫిక్స్ నుంచి కథనం వరకూ ప్రతీ అంశంలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపించింది. 2017లో బాహుబలి రెండో పార్ట్ రిలీజ్ డేట్ ప్రకటించగానే, ఈ ఏడాదికి అదే నెంబర్ వన్ సినిమా అవుతుందని ముందే ఫిక్స్ అయిపోయారు జనాలు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మొదటి పార్ట్ ను మించి సినిమా ఉండటంతో, ప్రేక్షకులు రిపీటెడ్ గా రెండో భాగాన్ని ఎగబడి..ఎగబడి మరీ చూశారు. సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత కూడా టిక్కెట్స్ దొరకలేదంటేనే సినిమా విజృంభణను అర్ధం చేసుకోవచ్చు. ఇక కలెక్షన్స్ పరంగా బాహుబలి రెండు భాగాలు కలిపి వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి, భారతదేశ చలనచిత్ర చరిత్ర లో ఆ ఘనత సాధించిన తొలి సినిమా సీరీస్ గా ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
బాహుబలి గురించి చెప్పుకోవాలి కానీ ఎంతైనా అలా ఉంటూనే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే, బాహుబలి 2017 టాప్ మూవీ. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండే ప్రసక్తి లేదు. ఇక 2017లో ఇండియా మొత్తమ్మీద కూడా టాప్ 5 నిలుస్తుంది బాహుబలి, ది కంక్లూజన్.!