ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వక విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయేలా మహాసభలు ఉండనున్నాయని తెలిపారు. సభ ప్రారంభం రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్లు నరసింహన్ ,విద్యాసాగర్ రావు హాజరవుతారు.ముగింపు రోజు భారత రాష్ట్రపతి పాల్గొంటారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 8000 మంది హజరవుతున్నారని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు. పద్యం, గద్యం వంటి వాటితో పాటు తెలుగు ప్రక్రియలపై చర్చలుంటాయన్నారు.
తెలుగు తల్లిని రెండు ప్రాంతాలకు కలిపి చెబుతుంటే కేసీఆర్ తెలంగాణ తల్లిని తెరపైకి తెచ్చారని ఎమ్మెల్సీ పల్లా వివరించారు. ప్రపంచ తెలుగుమహాసభలలో తెలంగాణ తల్లికి దండ వేసి గౌరవించిన తర్వాతే సభలు ప్రారంభం అవుతాయని వివరించారు. కొద్ది మంది కాంగ్రెస్ నిత్య దుఃఖితులకు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఆయన మండిపడ్డారు. సభలను వీక్షించి మాట్లాడాలే తప్ప , సభలను తగ్గించి చూపేలా విమర్శలు తగదని సూచించారు.
విరసం వంటి సంస్థలు రాజ్యాంగాన్ని గుర్తించరని…పిలిచినా వారు రారని అందుకే పిలువలేదని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని , తెలుగు బాష ఖ్యాతిని పెంచేలే సభలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో వేదికలు, స్వాగత తోరణాలు తెలుగుతనాన్ని చాటి చెప్పేలా ఉంటాయని అన్నారు.