మన యాస, భాషకు చక్కటి వేదిక ప్రపంచ తెలుగు మహా సభలని అందరూ భావిస్తుంటే కొందరు కువిమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. భాష, ప్రాంతం వేరన్న సంగతి గుర్తించలేవి వారే ఇలా విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ యాసను మాట్లాడనివ్వని పరిస్థితుల్లో…భాషకు తల్లులు ఉండరని ఉద్యమంలో చెప్పామని ఆయన వివరించారు. భారత మాత, తెలంగాణ తల్లి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
గతంలో ఆంధ్ర మాత ఉండేదని…కుట్రతో తెలుగు తల్లిగా మార్చారని ఎమ్మెల్సీ కర్నె వివరించారు. తెలుగు తల్లికి దండ వేస్తారా…తెలుగు తల్లికి వెస్తారా అని కాంగ్రెస్ నేతలు కొందరు మాట్లాడుతున్నారని పేర్కొంటూ మేం తెలుగు తల్లినే తప్ప ఆంధ్ర మాతను విమర్శించలేదు అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ తల్లే గౌరవం పొందుతుందని వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభలు ఇంటి పండుగ అని పేర్కొంటూ దీన్ని శపిస్తూ మాట్లాడటాన్ని ప్రజలు సహించరని హెచ్చరించారు.
ప్రతీ కార్యక్రమం కాంగ్రెస్ నేతలకు కమిషన్ల కోసమే అని భావిస్తున్నారని పేర్కొంటూ…అది కాంగ్రెస్ నైజమని ఎమ్మెల్సీ కర్నె విరుచుకుపడ్డారు. తెలంగాణ యాసకు, మాండలికానికి ప్రపంచ వేదికపై గౌరవం పొందే కార్యక్రమమని వివరించారు. దీనికి యాభై కోట్ల ఖర్చు అని విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని వ్యాప్తి చేసే ప్రతీ కవి, రచయిత ఈ సభల్లో ఉంటారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారు, తెలంగాణ మాండలికాన్ని మాట్లాడేవారు గర్వించేలా సంబరాలుంటాయని స్పష్టం చేశారు. దీనికి అందరూ ఆహ్వానితులేనని అన్నారు. గతంలో పది జిల్లాలుండేవని ఇప్పుడు 31 జిల్లాలకు సంబంధించి గేయం త్వరలోనే ఉంటుందన్నారు. ప్రస్తుత సభలో జాతీయ గీతం మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Post Views: 212