ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్ళ పైనే మైండ్ గేమ్ మొదలు పెట్టాడు. మంగళవారం జరిగిన పార్టీ, ప్రభుత్వ సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలకు పోయే ప్రసక్తేలేదని.. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై ప్రాధాన్యత లేదని, అందరితోనూ మమేకమై పేరు సంపాదించిన వారికే టిక్కెట్లు కేటాయిస్తానని అన్నారు. కేవలం నియోజకవర్గాల్లో పార్టీ ఇస్తున్న సమాచారంపై మాత్రమే ఆధారపడటం లేదని, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకుని ముఖ్యమైన వివరాల సాయంతో సమీక్షిస్తున్నానని, దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటానని బాబు వెల్లడించారు.
ఇక పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లుగా నియమించిన మంత్రులు పనితీరుపై కూడా బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరిద్దరు తప్పా మిగతావాళ్లు ఏమాత్రం పనిచేయడం లేదని బాహటంగానే వ్యాఖ్యానించారు. అలాగే మహిళ మంత్రులు పరిటాల సునీత, భూమా అఖిలప్రియలకు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. పార్టీ అధినేత ఖరాఖండిగా చెప్పేసరికి టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకూ తమకు తిరిగి పోటీ చేసే అవకాశం లభిస్తుందని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా బాబు వ్యాఖ్యలతో తిరుగుబాటు మొదలెట్టారని సమాచాం. ముఖ్యంగా అగ్రిగోల్డ్ సమస్య, నిరుద్యోగ భృతి, ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యలు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ఏ అభివృద్ది చేయాలన్నా.. నిధులు లేవంటుంటే.. మేము మాత్రం ఏం చేయాలని చంద్రబాబుని గట్టిగానే నిలదీశారని సమాచారం. ఏది ఏమైనా సోషల్ మీడియాలో చంద్రబాబు పై సెటైర్లు పడుతున్నాయి. బాబు గారు జీవితంలో మొదటి సారి నిజం ఒప్పుకున్నారని.. టీడీపీ నేతలు ఎంత పనిమంతులో బాబు ఒప్పేసుకున్నారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.