ఒక్క చాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటానంటూ ఫిల్మ్ నగర్‌లో చెప్పులరిగేలా తిరిగే వాళ్లు ఈరోజుకూ ఉన్నారు. టాలీవుడ్‌లో చాలామంది ఆ ఒక్క చాన్స్ వల్లే ఈరోజు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎన్ని సినిమాలు తీసే సత్తా ఉన్నా ఒక్క హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎన్నటికీ గుర్తింపు రాదు. అయితే ఏం కష్టం వచ్చిందో టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని యూసఫ్‌గూడలో అపార్ట్‌మెంట్‌లో విజయ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు, సోగ్గాడు, భగీరథ, డిస్కో తదితర చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాల్లో అవకాశాల్లేక ఇలా చేసుకున్నాడని కొందరు అంటుండగా, భార్యతో విభేదాల కారణంగానే బలవన్మరణం చెందాడంటూ వదంతులు వినిపిస్తున్నాయి. విజయ్‌కు వనితకు గత మూడేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. డబ్బు కోసం వనిత విజయ్ ను తరచూ వేధించేదని.. మూడు రోజుల క్రితం అంటే ఈ నెల 9న రౌడీలతో భర్త దగ్గరికి వచ్చి బెదిరించి మరీ బలవంతంగా కారును లాక్కెళ్లింది. ఈ మేరకు విజయ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ విషయంలో పూర్తి విచారణ చేపట్టాకే స్పందిస్తామని పోలీసులు చెబుతున్నారు.