ఇండస్ట్రీలో కల్లోలం సృష్టించిన డ్రగ్స్ రాకెట్‌తో లింకులు ఉన్న టాలీవుడ్ ప్రముఖుల రహస్యం బట్టబయలయ్యాయి.డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిన కెల్విన్ మెల్లగా తెలుగు సినీ పరిశ్రమపై కన్నేశాడు. దాదాపు నాలుగేళ్ల క్రితమే అతడికి పరిశ్రమతో బంధం ఏర్పడింది. ప్రధానంగా ఎల్‌ఎస్డీ దిగుమతి చేసుకొని సరఫరా చేసేవాడు. తొలుత ఓ దర్శకుడితో పరిచయం చేసుకున్నాడు. క్రమంగా పరిచయాలను విస్తరించుకుంటూ అనేకమందికి సరఫరా చేయడం ప్రారంభించాడు. డ్రగ్స్ రాకెట్‌తో లింకులు ఉన్న సినీ ప్రముఖలను జూన్ నెల 19 నుంచి 25 వరకు డ్రగ్స్ దందాతో లింకులున్న నిందితులను సిట్ కార్యాలయంలో విచారించిన సంగతి తెలిసిందే.అయితే తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎక్సైజ్ సిట్ పూర్తిస్థాయి ఆధారాలను సేకరించలేక పోయిందని… సిట్ చేసిన హడావుడి, గంటల తరబడి విచారణ అంతా ఉత్తదేనని తేలిపోయింది.
అకున్ సబర్వాల్ సారథ్యంలోని ఎక్సైజ్ సిట్ 10 మంది సినీ ప్రముఖులను విచారించగా.. ముగ్గురి నుంచి మాత్రమే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారని శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని… ఈ మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎక్సైజ్ సిట్‌కు నివేదిక అందిందని విశ్వసనీయ సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక అందిన నేపథ్యంలో ఈ నెల చివరి వారంలోగా చార్జిషీటు వేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది.
ఎక్సైజ్ సిట్‌కు ఏమేం దొరికాయి?
విచారణ ఎదుర్కొన్న హీరోయిన్ ఫోన్ నుంచి కెల్విన్‌కు 40 ఎస్సెమ్మెస్‌లు వెళ్లాయి. అందులో ఒక్క ఎస్సెమ్మెస్‌లో మాత్రమే ఎల్‌ఎస్‌డీ అనే పదం ఉంది. మిగతా వాటిలో బ్లాటింగ్, మెటీరియల్ అనే పదాలను వాడినట్లు సిట్ గుర్తించింది. ఇక ఆ హీరోయిన్ నుంచి కెల్విన్‌కు ఎస్సెమ్మెస్ వెళ్లిన ప్రతిసారి అరగంట గంట సమయంలోపు సదరు దర్శకుడి బ్యాంకు ఖాతా నుంచి కెల్విన్ ఖాతాలోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఈ హీరోయిన్, దర్శకుడు, కెల్విన్ కలసి ఉన్న ఫొటోలు కూడా దొరికాయి. ఈ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగింది. ఆ దర్శకుడిని సుదీర్ఘంగా విచారించి, వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. అయితే ఈ ఆధారాలేవీ కోర్టులో గట్టిగా నిలవవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఎల్‌ఎస్‌డీ అంటే సినీ పరిభాషలో ‘లైట్ స్కేల్ డిన్నర్ (తక్కువ స్థాయిలో భోజనం)’అనే వాడుక ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కాబట్టి సినీ ప్రముఖుల బ్యాంకు ఖాతాల నుంచి ఆయనకు డబ్బు వెళ్లేందుకు చాలా అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి.