జగన్ పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరైన జగన్.. మళ్లీ అనంత చేరుకొని తన పాదయత్రని కొనసాగిస్తున్నారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన జగన్ అనంతలోని ఎంపీ సీట్ల విషయంలో సంచలన ప్రకటన చేశారు. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకదాన్ని బీసీలకు కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము తప్పిదం చేశామని.. ఈ సారి అలాంటి తప్పు రిపీటవ్వదని జగన్ అన్నారు.
ఇక గత ఎన్నికల్లో వైసీపీ రెండు ఎంపీ సీట్లనూ ఓసీలకే కేటాయించింది. అనంతపురం ఎంపీ సీటు నుంచి అనంత వెంకట్రామిరెడ్డి పోటీ చేయగా, హిందూపురం ఎంపీ సీటు నుంచి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ రెండు సీట్లలోనూ వైసీపీ బోల్తా కొట్టి ఓటమి చవి చూసింది. దీంతో గత ఎన్నికల ముందే ఒక సీటును బీసీలకు కేటాయించాల్సిందని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పొరపాటు చేసేది లేదని.. ఒక సీటును బీసీలకు కేటాయిస్తానని జగన్ ప్రకటించడంతో అనంత రాజకీయాలు హీటెక్కాయి.