తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును.. ముఖ్యమంత్రి కేసీఅర్ రీ డిజైనింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు.ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ … జాతీయ స్థాయిలో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టే అధికారంలో ఉండి.. సుమారు 7 వేల కోట్లు ఖర్చు చేసినా ప్రాణహిత-చేవెళ్ల బ్యారేజ్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించాలని వినోద్ సూచించారు. కేసుల ద్వారా ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకొని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. ప్రజల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకోవద్దని హితవు పలికారు.