తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సరం కానుకగా శుభవార్త అందించనుంది..ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపధ్యంలో దాదాపు మూడు వేల ఉద్యోగాలు భర్తీ కి ప్రకటనలు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సమాయత్తమవుతున్నది.
దాదాపు 1,500 గ్రూప్ 4 పోస్టులు, 700 వీఆర్వో పోస్టులు, 210 డిప్యూటీ సర్వేయర్లు, 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 82 అసిస్టెంట్ ఇంజినీర్లతోపాటు ఇతర క్యాటగిరీలకు చెందిన మరికొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం.భూరికార్డుల ప్రక్షాళనను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖకు సంబంధించిన కొలువుల భర్తీకి అనుమతులివ్వటంతో టీఎస్ పీఎస్పీ దాదాపు 700 వీఆర్వో పోస్టుల భర్తీకి సిద్ధపడుతున్నది. దీంతోపాటుగా పలు శాఖల్లోని 1,500 గ్రూప్ 4 ఖాళీల భర్తీకి కూడా ఈ నెలలోనే ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం. మహిళా, శిశు సంక్షేమశాఖలోని సూపర్‌వైజర్లు, రెవెన్యూశాఖలోని డిప్యూటీ కలెక్టర్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖలోని జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టనున్నట్టు తెలుస్తున్నది.