ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఇంటర్వ్యూలో సరైన నైపుణ్యాలు ప్రదర్శించలేక చాలా మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతుంటారు. సంస్థలుపెట్టే ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులై చివరకు ఇంటర్వ్యూ సమయానికి చిన్న చిన్న పొరపాట్లు చేయడంతో సమయం వృధా కావడంతోపాటు అవకాశాలను చేజార్చుకుంటుంటారు. ముందుగానే సంస్థకు సంబంధించి, కరెంట్ ఎఫైర్స్ గురించి, వివిధ అంశాల్లో పూర్తి పరిజ్ఞానంతో ఇంటర్వ్యూకు వెళ్లినప్పటికీ.. తీరా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వెనుదిరిగేవారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాసినా.. ఆ పప్పులన్నీ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఉడకవు.
ముఖ్యంగా.. ఇంటర్వ్యూలో 90 శాతం మీ బలహీనతలు ఏమిటి అనే దానిపైనే హెచ్ఆర్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటాడు. అవి అవసరం లేనివని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ప్రశ్నలకు మీరు చెప్పే జవాబులపైనే హెచ్ఆర్ తన దృష్టినంతా ఉంచుతాడు. అంతేకాదు, మీ ఎంపిక ఈ ప్రశ్నలకు చెప్పే సమాధానాల మీదే ఆధారపడి ఉంటుందని గుర్తించండి.
ఇందుకు అనుగుణంగా.. మీ బలహీనతలపై అవగాహన కలిగి ఉండండి. అంతేకాక, మీకు బలహీనతలు లేవు అని ఎన్నడూ చెప్పొద్దు. ఎందుకంటే బలాలు, బలహీనతలు లేని వారంటూ ఈ ప్రపంచంలో ఉండరన్నది నిత్య సత్యం. నాకు ఎటువంటి బలహీనతలు లేవు అంటూ చెప్పినట్లయితే మీపై ఉన్న అభిప్రాయం కాస్తా నెగిటివ్‌గా మారే అవకాశం ఉంది. మీరు గతంలో విఫలమైన సందర్భం గురించి చెప్పండి.. మీరు ఆ సవాలు గురించి ఎలా బయటపడగలిగారు.. మీరు దానిని ఎలా అధిగమించారు అన్న విషయాలను హెచ్ఆర్‌కు వివరించండి. ప్రస్తుతం హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఎక్కువగా ఇటువంటి ప్రశ్నలే ఎదురయ్యే అవకాశం ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు.
అందుకు అనుగుణంగా ఈ ప్రశ్నలన్నింటికీ ముందుగానే ప్రిపేరవడం మంచిది. ఇప్పట్నుంచే మీలోని బలహీనతలను గుర్తించడం ప్రారంభించండి. మీకు ఇంటర్వ్యూలో ఎదురయ్యే ఇటువంటి ప్రశ్నలకు నిజాయితీ పద్ధతిలో సమాధానం చెప్తే ఉద్యోగం తప్పనిసరి అంటున్నారు విశ్లేషకులు.