బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. సినీ ఫక్కీలో బైక్‌లపై వచ్చిన యువకులు పట్టపగలు అందరూ చూస్తుండగా రౌడీషీటర్‌ను కిరాతకంగా నరికిచంపారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మాచవరం ఏరియాలో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్‌పేటకు చెందిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం (35), అలియాస్ సుబ్బు తన ప్రత్యర్థుల చేతిలో విజయవాడ నగరంలోని మాచవరం ఏరియాలో బుధవారం దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆరుగురు వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో సుబ్బును నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారు. జన సంచారం రద్దీగా ఉండే ఏలూరు రోడ్డుకు సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. అంతేగాక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరుడని సమచారం. గతంలో సుబ్రమణ్యం టీడీపీ యువజన నాయకుడు కాట్రగడ్డ శ్రీను వద్ద పనిచేసేవాడు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్, కాల్‌మనీ వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. టీడీపీ యూత్ విభాగం నగర అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీను తన భర్తను హత్య చేయించాడని మృతుడి భార్య దుర్గ, ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ఆరోపించారు.
