హైదరాబాద్ నగర వాసుల కలల మెట్రో నవంబర్ 28న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మధ్య 30 కిలో మీటర్లు నడుస్తున్న మెట్రోకు నగర వాసుల నుంచి విశేష ఆదరణ వస్తోంది.
ఈ క్రమంలో గత కొంత కాలం నుండి ఐఎస్‌బీ – గచ్చిబౌలి మార్గంలో మెట్రో పిల్లర్‌లో పగుళ్లంటూ సామాజిక మాధ్యమాల్లోఒక ఫోటో చక్కర్లు కొడుతుంది … ఈ నేపధ్యంలో మెట్రో పిల్లర్‌కు పగుళ్లు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తమని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.అసలు ఆ మార్గంలో మెట్రో లైనే లేదని తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో హైదరాబాద్ మెట్రోది కాదని.. పెషావర్‌లోని మెట్రో పిల్లర్ అని ఆయన బుధవారం వెల్లడించారు. వేల టన్నుల బరువు, భూకంపాలను సైతం తట్టుకునేలా హైదరాబాద్ మెట్రోను నిర్మించామన్నారు. కొందరు ఓర్వలేక మెట్రోపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇలాంటి వార్తలపై గతంలోనే మంత్రి కేటీఆర్ వివరణ కూడా ఇచ్చారని అయన పేర్కొన్నారు.