తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 45వేల చెరువుల పునరుద్ధరణ పథకం చాలా మంచి కార్యక్రమం అని కితాబిచ్చారు. మంగళవారం బెంగళూరులో నదుల పునరుజ్జీవనంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సమాజంలోని అన్ని రంగాలవారు భాగస్వాములైనప్పుడే నదుల పునరుజ్జీవనంపై దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. నీటి కొరత కారణంగానే రాష్ర్టాల మధ్య జల వివాదాలు నెలకొంటున్నాయని, వీటిని పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
