సినీ దర్శకులకు రాయలసీమ పేరు చెబితే చాలు.. వెంటనే కెమెరాను బాంబులు, వేటకొడవళ్ల వైపు తిప్పేస్తారు. కానీ, ఆ సన్నివేశాలను చూసిన సినీ అభిమానులు మాత్రం.. అరెరే రాయలసీమలో ఫ్యాక్షన్ గురించి చాలా అతిగా చూపిస్తున్నాడే అనుకోవడం సహజమే. మరికొందరు రాయల సీమలో ఫ్యాక్షన్ అనేది గతం. కానీ.. ఇప్పుడు అలా లేదు అంటూ బుకాయించేవారు లేకపోలేదు. అయితే, అవన్నీ అసత్యాలే… రాయల సీమలో ఫ్యాక్షన్ ఇంకా బతికే ఉంది అని రుజువు చేసేలా మరో ఘటన చోటు చేసుకుంది.
అయితే, ఏకంగా ప్రభుత్వ అధికారిపైనే ఈ దాడి జరగడం గమనార్హం.
సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జమ్మలమడుగుకు చెందిన కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ఇవాళ అనంతపురం మున్సిపల్ డిప్యూటీ ఇంజినీరు కిష్టపపై దాడికి తెగబడ్డాడు. నాకు రావాల్సిన బిల్లును జాప్యం చేస్తావా అంటూ బూటుకాళ్లతో తన్నాడు. అయితే, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి నగరపాలక సంస్థకు రోడ్డు ఊడ్చే యంత్రాలను సరఫరా చేశాడు. ఈ నేపథ్యంలో యంత్రానికి సంబంధించిన బిల్లును చెల్లించే క్రమంలో నరసింహారెడ్డికి డీఈ ఇది వరకే రూ.23 లక్షలు చెల్లించారు. మరో రూ.15 లక్షల బిల్లు చెల్లించేందుకు జరిగిన పనులపై విచారణ కొనసాగుతోంది. తనకు రావాల్సిన బిల్లుపై జాప్యం చేస్తుండటంతో నరసింహారెడ్డి మునిసిపల్ ఆఫీసుకు వచ్చి ఇంజినీర్లను కూడా తిట్టాడు.
ఈ క్రమంలో డీఈ కిష్టప్ప జోక్యం చేసుకుని సభ్యతగా మాట్లాడాలని కోరగా నరసింహారెడ్డి ఒక్కసారిగా శివాలెత్తి పోయాడు. నాకు చెప్పడానికి నువ్వెవరివోయ్… అంటూ రోడ్డుపైనే డీఈపై దాడికి దిగాడు. గొడవ కాస్త సర్దుమణిగాక కిష్టప్ప తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా రఘువీరా టవర్స్ వద్ద నరసింహారెడ్డి మళ్లీ అడ్డుకున్నాడు. రోడ్డుపైనే డీఈ కిష్టప్పను విచక్షణారహితంగా కొట్టాడు. ‘‘రేయ్..నా.. కొడకా.. నాది కడప రేయ్.. నాది జమ్మలమడుగు.. నాతో పెట్టుకోవద్దు.. నాకు తిక్క రేగిందా.. బాంబులు తెచ్చి మీ ఆఫీసు మీదేస్తా..’’ అంటూ డీఈని బూటుకాళ్లతో తంతూ నరసింహారెడ్డి నోట జాలువారిన మహత్తర సుభాషితాలు ఇవి. కిష్టప్ప తర్వాత వన్‌టౌన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. నగరపాలక సిబ్బందితో పాటు పలువురు గుత్తేదారులు డీఈకి మద్దతుగా స్టేషనుకు వెళ్లారు. పోలీసులు రెడ్డిని అరెస్ట్ చేశారు. కిష్టప్పపై దాడికి నిరసనగా మునిసిపల్ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు.
అనంతపురం మునిసిపల్ డిప్యూటీ ఇంజినీరు కిష్టప్పను సోమవారం నగరంలోని రఘువీరా టవర్స్ వద్ద ఈ కంత్రీ కాంట్రాక్టర్ బూటు కాళ్లతో తన్నుతూ, మాటల్లో చెప్పలేని బూతులు తిడుతూ దాడి చేశాడు. డీఈ ఏం చెబుతున్న వినకుండా కాళ్లతో ఎగిరెగిరి తన్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆ రాక్షసుడికి భయపడి జోక్యం చేసుకోలేదు. ఈ దాడిలో డీఈ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. డీఈపై దాడి అనంతరం వన్‌టౌన్ పోలీసు స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. డీఈపై దాడికి నిరసనగా నగరపాలక సిబ్బందితో పాటు పలువురు గుత్తేదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరసింహారెడ్డిని అరెస్ట్ చేశారు.