ఈ పర్యటన ముగిశాక గంభీరావుపేట మండలం గజసింగవరంలో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిదవ నెల నుంచే ప్రాజెక్టుల కోసం పని మొదలు పెట్టామని వెల్లడించారు. కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, ప్రాణహిత ఎత్తిపోతలు కాదు ఉత్తిపోతల పథకమని విమర్శించారు. నీటి లభ్యత లేనిచోట ప్రాజెక్టు కట్టేందుకు డిజైన్ చేశారని, సీఎం కిరణ్‌కుమార్ ఉన్నపుడు కేంద్ర నీటి కమిషన్ ప్రాణహిత-చేవెళ్ళ పథకం డిజైన్‌పై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాసిందన్నారు. ‘ప్రాణహిత-చేవెళ్ళ’ రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం14 టీఎంసీలు ఉంటే రీడిజైన్‌లో భాగంగా కాళేశ్వరానికి 15 రోజుల్లో అటవీ శాఖ అనుమతులు తెచ్చామన్నారు. కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులను ఆపేందుకు న్యాయవాదుల ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారని, ప్రాజెక్టులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ డిజైన్ చేసింది ప్రాణం లేని ప్రాణహిత అని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు గంటెడు నీళ్లిచ్చే ఆలోచన చేయలేదని, సగటు వర్షపాతం కంటే దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది తెలంగాణలోనే అయినా కరవు ప్రాంతంగా తెలంగాణను చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు. సోమవారం సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు నుండి మిడ్ మానేరు బ్యాక్ వాటర్ మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనులు, మల్కపేట రిజర్వాయర్ పనులను కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాలల్లో పర్యటించి పరిశీలించారు.