కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో వాహనంతో గుద్ది అనంతరం కత్తులతో నరికి చంపారు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద ప్రత్యర్థులు కాపు కాశారు . అక్కడికి రాగానే తన స్కార్పియో ఏపీ 26 ఏఎన్ 4945తో బోయ కృష్ణ నడుపుతున్న పల్సర్ వాహనాన్ని ఢీ కొట్టి ఆయన కాలుపై ఎక్కించారు.
కాలు విరిగిన కృష్ణ అక్కడి నుంచి కదలలేకపోయాడు. తర్వాత అతడిని అతి దారుణంగా కత్తులతో తలపై, గొంతుపై నరికి పరారయ్యారు. మృతుడు కృష్ణ.. ఇటీవల కర్నూలు శివారులో హంద్రీనీవా కాలువ దగ్గర జరిగిన ఎంకే రాముడు హత్య కేసులో ప్రధాన నిందితుడు. కృష్ణ హత్యతో రుద్రవరం గ్రామంలో టెన్షన్ టెన్షన్ నెలకొంది.
అయితే బోయకృష్ణను చంపడానికి నిందితులు వాడిన ఏపీ 26 ఏఎన్ 4945 స్కార్పియో వాహనంలో టీడీపీ కండువాలు ఉన్నాయి. అనుమానితుల్లో ఒకరైన కురువ వేంకటేశ్వర్లు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడి అనుచరుడు. తండ్రి హత్య తర్వాత ఆయన పంచాన చేరాడు. అంతకు ముందు ఆ నేతే.. తన అనుచరుడిగా ఉండమని బోయకృష్ణను కోరితే ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో తమ ప్రత్యర్థి వెంకటేశ్వర్లుకు ఆ నేత అన్ని విధాలుగా సహాయం చేసి హత్య చేయించాడని బోయకృష్ణ బంధువులు సంఘటన స్థలంలో ఆరోపించారు. ఈయన హస్తం ఉన‌్నట్లు కూడ వారి బందువులు ఆరోపిన్తున్నారు.