తాళి కట్టిన వాడే రాక్షసుడై దాడి చేయడంతో తేరుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో కన్నోళ్లు పెళ్లి చేస్తే ఆ బంధం దారుణంగా చెదరిపోతుందని భావించలేకపోయింది శైలజ. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు. అబ్బాయి బాగానే ఉన్నాడని భావించారందరూ. అతడు సంసార జీవితానికి పనికి రాడ నే విషయం దాచిపెట్టినట్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. తొలిరాత్రే… ఆ వధువు చేదు అనుభవాన్ని చవిచూసింది. దెబ్బలకు తాళలేక నవవధువు చేసిన ఆర్తనాదాలకు భయపడిన తండ్రి… తలుపులు తీయాలన్నాడు. దీంతో… తలుపులు తీసి భర్త పరారయ్యాడు. లైట్లు వేసిన తండ్రికి.. కూతురు తీవ్రగాయాలతో పడి వున్న విషయాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. భర్త వికృత చేష్టలతో ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళితే.. మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్కు, చిన్నదామరగుంటకు చెందిన మునికృష్ణారెడ్డి కుమార్తె శైలజతో శుక్రవారం పెళ్లి జరిగింది. రాజేష్… వి.కోట మండలం ఆదినపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా…. శైలజ ఎంబీయే సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం జీడీ నెల్లూరు మండలం కొత్తపల్లిమిట్ట కళ్యాణమండపంలో వైభవంగా శైలజ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత… కాణిపాకం వెళ్లి నవదంపతులు దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం పెద్దదామరగుంటలోని వధువు ఇంట శుక్రవారం మొదటిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే రాజేష్ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా పంటితో విపరీతంగా కొరికి గాయపరిచాడు.
నోట్లో గుడ్డలు కుక్కి కళ్లు, ముఖం వాచేలా చిత్రహింసలకు గురిచేశాడు. భర్త దెబ్బలు తట్టుకోలేక.. శైలజ కేకలు వేయటంతో ఆమె తండ్రి కంగారుపడిపోయాడు. గది తలుపులు తీయాలంటూ చెప్పాడు. దీంతో గది తలుపులు తీసిన భర్త రాజేష్…. శైలజ తండ్రిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. మొదటిరాత్రి రోజే.. అల్లుడి శాడిజాన్ని చూసిన శైలజ తల్లిదండ్రులు గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నన్నపనేని రాజకుమారి…
ఈ ఘటనపై నన్నపనేని రాజకుమారి స్పందించారు. శైలజపై దాడి ఘటన దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. రాజేష్ తండ్రి కూడా శైలజతో దారుణంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ లాంటి చేతకాని వాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఆమె మండిపడ్డారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలలోని లోపాన్ని దాచిపెట్టి అమ్మాయిల జీవితాలను నాశనం చేయవద్దని హితవు పలికారు. ప్రభుత్వంతో మాట్లాడి శైలజకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. నన్నపనేని రాజకుమారి సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బాధితురాలికి అండగా ఉంటమని చెప్పారు.