గత మే నెలలో పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. అలాంటి ఘటనే మళ్లి అదే కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో వాహనంతో గుద్ది అనంతరం కత్తులతో నరికి చంపారు. కృష్ణ కర్నూలుకు బైక్పై వెళ్లి స్వగ్రామం రుద్రవరంకు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ప్రత్యర్థులు కాపు కాచి పథకం ప్రకారం మట్టుబెట్టారు. మృతుడు కృష్ణ.. ఇటీవల కర్నూలు శివారులో హంద్రీనీవా కాలువ దగ్గర జరిగిన ఎంకే రాముడు హత్య కేసులో ప్రధాన నిందితుడు. కృష్ణ హత్యతో రుద్రవరం గ్రామంలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా వరుస హత్యలు జరుగుతుండంతో జిల్లా మొత్తం ఎప్పుడు, ఎక్కడ, ఏమి జరుగుతుందో అని ప్రజలు బయపడుతున్నారు.
