గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలు జరువుతున్నారని టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. నిన్న ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కానీ ఆత్మహత్య చేసుకోవద్దు అని తాము కోరుకుంటున్నామన్నారు. విద్యా బుద్ధులు చెప్పే కోదండరాం గారు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రొఫెసర్ కోదండరాం నిరుద్యోగులకు మంచి చెప్పాల్సింది పోయి వారిని రెచ్చగొడుతున్నారని ఆయన
మండిపడ్డారు.
గతంలో జయశంకర్ సర్ విద్యార్థులకు మంచి విద్యను ప్రోత్సహిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపేవారని…కానీ కోదండరాం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో 23 జిల్లాలకు ఏపీపీఎస్సి ద్వారా 24086 ఉద్యోగాలు భర్తీ చేస్తే కేవలం రెండున్నర సంవత్సరాలకే కేసీఆర్ ప్రభుత్వం టీఎస్పిఎస్సి ద్వారా 29201 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఇది తమ నాయకుడు కేసీఆర్ సత్తా అని అన్నారు.
మురళి అనే విద్యార్థి మొన్ననే డిగ్రీ కంప్లీట్ చేసి పీజీలో చేరాడని… ఆయన ఇప్పటి వరకు ఎలాంటి జాబ్ కి అప్లై చేయలేదని తెలిపారు. కనీసం టీఎస్పీఎస్సీలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో కూడా అప్లై చేయలేదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పోలీస్ శాఖలో కూడా ఎక్కడా అప్లై చేయలేదన్నారు.ఇంటర్నల్ పరీక్షలు బాగా రాయలేదని భయపడి చనిపోతే నిరుద్యోగంతో అంటూ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. కోదండరాం శవ రాజకీయాలు చేస్తూ పిచ్చిపిచి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరికి నిరుద్యోగులే బుద్ది చెప్తారని, వారిని తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
టీడీపీ నేత ఒంటెరు ప్రతాప్ రెడ్డికి ఓయూలో ఎం పని అని ఆయన ప్రశ్నించారు. ఓయూకి వచ్చి అనవసరంగా రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. లగడపాటికి పట్టిన గతే కోదండరాంకు పడుతుందన్నారు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, అధికార దాహంతో అనవసర ఆరోపణలు మానుకోవాలని స్పష్టం చేశారు.