ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పత్తికొండ నియోజక వర్గం ఎర్రగుడిలో రైతులతో వైఎస్ జగన్ ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని ప్రశ్నించారు. పట్టి సీమలో నీళ్లు పోసి, ప్రకాశం బ్యారేజీ వద్ద 50 టీఎంసీలు సముద్రంలో విడిచి పెడితే ఫలితం ఏముంటుందన్నారు. పులిచింతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాస్తున్నా, ఆ వివాదాన్ని పరిష్కరించడం లేదన్నారు. దీంతో 45 టీఎంసీల నీరు అందుబాటులోకి రాకుండా పోయింది. ప్రాజెక్టు కాంట్రాక్టర్లును కమీషన్ల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.
రైతులు సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులను కోరిన వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ప్రతి రైతు కుటుంబానికి మే, జూన్ నెలల్లో పంటలు వేసే ముందు రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా రైతు వ్యవసాయ ఉత్పత్తి వ్యయం బాగా తగ్గిస్తామన్నారు. ప్రతి ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు ఎక్కడైనా చనిపోతే వైఎస్‌ఆర్ బీమా కింద రూ.5 లక్షలు ఇస్తామన్నారు.