టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి శ్రీలంకతో జరిగే టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగాడు.. చివరిదైన మూడో టెస్టులో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్ సెంచరీ మార్కును చేరాడు. దాంతో వరుసగా రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకుని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మరొకవైపు తన టెస్టు కెరీర్‌లో ఆరో డబుల్ సెంచరీని కోహ్లి సాధించాడు. తద్వారా ఆరు డబుల్ సెంచరీలు సాధించిన భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన నిలిచాడు. మరొకవైపు ఓవరాల్‌గా కెప్టెన్ హోదాలో ఆరు డబుల్ సెంచరీలు కోహ్లి నమోదు చేయడంతో బ్రియాన్ లారా(5)ను అధిగమించాడు.
371/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆటను టీమిండియా ప్రారంభించింది.ఓవర్ నైట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు భారత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క‍్రమంలోనే కోహ్లి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతా టెస్టులో సెంచరీ (104 నాటౌట్) చేసిన కోహ్లి… నాగ్‌పూర్ టెస్టులో డబుల్ సెంచరీ (213) సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో టెస్టులో భారత జట్టు 108 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 451 పరుగులు చేసింది.