తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి ఎనిమిదో వర్థంతిని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి మరణం బాధాకరమన్నారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర శ్రీకాంతాచారికి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో మంత్రి జగదీష్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జరిగిన వర్థంతి సభలో పాల్గొన్నారు. శ్రీకాంతాచారి కలలుకన్న బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.
శ్రీకాంతాచారికి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద శ్రీకాంతాచారి విగ్రహానికి అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితరులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
శ్రీకాంతాచారి 8వ వర్ధంతిని వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట అమరవీరుల స్తూపం దగ్గర శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నేతలు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో శ్రీకాంతాచారి వర్థంతి నిర్వహించారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారికి నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం దగ్గర శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నేతలు నివాళులు అర్పించారు.