జగన్ పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఈ పాదయత్రలో జగన్ తన మనసులో భావాలను ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచే ప్రయత్నంచేస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో, ఏసీ వాహనాల్లో నాలుగు గోడల మధ్య లీడర్లు, సన్నిహితుల మాటలను వినే జగన్.. ఇప్పుడు నేరుగా ప్రజాసమస్యలను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ప్రతక్ష్యంగా ప్రజలు పడే బాధలు చూస్తున్నారు. పాదయాత్ర పొడవునా తన వద్దకు వచ్చి ప్రజలు చెప్పుకునే గోడును వింటున్నారు.
వాస్తవానికి జగన్‌కు క్షేత్రస్థాయిలో పాదయాత్ర ముందు వరకూ ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలియకపోవచ్చు. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారని ఆయనకు అవగాహన లేకపోవచ్చు. అయితే ప్రస్తుతం 25 రోజుల పాదయాత్రలోఆయన ఎన్నో తెలుసుకుంటున్నారు.. ఇంకా అనేక సమస్యలు తెలుసుకోనున్నారు. జగన్ ముఖ్యంగా పేద, బడుగు వర్గాల ప్రజల నుంచి నేరుగా సమస్యలు వింటున్నారు. వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక సమస్యలనూ ఆయన ఆకళింపు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే… జగన్ నిత్యం రాసుకునే డైరీలో ఆయన తన మనసులో మాటను వెల్లడిస్తున్నారు.
జగన్ పాదయాత్ర ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గంలో సాగింది. దారి పొడవునా ఎక్కడ చూసినా పేదరికపు ఛాయలే కన్పిస్తున్నాయి. పత్తికొండ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వర్షాభావం, కరువు కాటాకాలతో ఈ ప్రాంతం అత్యంత వెనకబడి ఉంది. పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో పత్తికొండ నియోజకవర్గం 144వ స్థానంలో ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ సాయం పైనే ఆధారపడుతున్నారు. వారి నిస్సహాయతను ఆధారంగా చేసుకుని మోసపూరిత వాగ్దానాలు చేసి ఓట్లు దండుకోవడం తప్ప పాలకులు వీరిని పట్టించుకోవడం లేదు.
ఒకప్పుడు మౌర్య చక్రవర్తి అశోకుడు, బ్రిటీష్ పాలకుడు సర్ థామస్ మన్రోల ఏలుబడితో చారిత్రక ప్రాధాన్యత పొందిన ఈ ప్రాంతం ఈరోజు విద్యా, వైద్య రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయింది. సాగు, తాగు నీటి కోసం ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి నాన్నగారు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఈనియోజకవర్గంలోని పందికోన, కృష్ణగిరి రిజర్వాయర్లను, అన్ని చెరువలను నింపి నీటి కొరత తీర్చాలనుకున్నారు. ఈ ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయినా… మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. జగన్ తన పాదయాత్ర అనుభవాలను డైరీలో పంచుకుంటున్నారు.