తమ ఆకాంక్షాలను చిదిమేసుకోకుండా…విద్యార్థుల్
వరంగల్ జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉన్న తుమ్మ నాగేంద్ర అనే విద్యార్థికి ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ గురించి తెలియకపోయినప్పటికీ…తన ఆలోచలనకు ఆచరణ రూపం ఇవ్వాలని భావించారు. తన ఆలోచనలను టాస్క్ ద్వారా వ్యక్తీకరించగా ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయనకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తన సొంత వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుకోవడమే కాకుండా…విద్యాపరమైన అంశాల్లో విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. నగర పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థి కె.కౌండిన్య సురక్షితమైన ఏసీ హెల్మెట్‌ను రూపొందించాడు. ఈ ఏసీ హెల్మెట్ ఇటు పరిశ్రమల్లోనే కాకుండా అటు బొగ్గు గనుల్లో కూడా ఉపయోగించుకునేలా ఉండటం విశేషం.మరో ఇంజినీరింగ్ విద్యార్థి కార్లు, బైక్‌లకు సంబంధించిన ఫోమ్ వాష్‌ను రూపొందించాడు. నీటిని ఏమాత్రం ఉపయోగించనవసరం లేకుండా ఫోమ్ ఆధారంగా సాగే ఈ వాషింగ్ ప్రక్రియకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఆయన సహచర విద్యార్థి అయిన అభిరామ్ అభి క్లిక్స్ పేరుతో ప్రత్యేకంగా ఓ ఫోటో స్టూడియోను ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటికే వినియోగదారులను కూడా సంపాదించుకున్నాడు.
ఐఎస్‌బీలో స్వల్పకాల శిక్షణకు అయినా కనీసం రూ.16 లక్షల ఫీజు ఖర్చవుతుందని కానీ టాస్క్ శిక్షణ ద్వారా విద్యార్థులు కేవలం 16వేలు చెల్లిస్తే సరిపోతుందని టాస్క్ సీఈఓ సుజీవ్ నాయర్ తెలిపారు. ‘కొత్త ఆలోచనతో ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అవి ఆవిష్కరణ దశకు చేరే ప్రక్రియలో విజయవంతం అయ్యేది తక్కువ శాతమే. ఇది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్. 265 మంది విద్యార్థుల్లో 4 స్టార్టప్‌లు విజయవంతంగా సాగడం పరిశీలిస్తే చిన్న అంశం వలే కనిపిస్తుంది కానీ భాగస్వామ్యం పత్రం ద్వారా వారికి ఉద్యోగం పొందడం, స్టార్టప్ ఆలోచనలు కలిగిన మరెవరితో అయినా…జట్టుకట్టడం కోసం ప్రయాణం అత్యంత తేలిక అవుతుంది. అన్నింటికీ మించి ఐఎస్‌బీ శిక్షణ ద్వారా వచ్చిన పరిజ్ఞానం వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దేదిగా ఉంటుంది’ అని ఆయన వెల్లడించారు.