ఏపీలో నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా జరగడంతో పోలీసులకు అంతు చిక్కడం లేదు. తాజాగా డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రమిజ భర్త చనిపోగా ఆరేళ్ల కుమారుడితో ఉంటోంది. సిద్ధూతో పరిచయమైన తర్వాత ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో సిద్ధూ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 20న నంద్యాలకు వెళ్లి అక్కడ కాపురం పెడదామని రమిజను నమ్మించి బేతంచర్ల బస్సు ఎక్కించాడు. డోన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో బస్సు దింపాడు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి హత్య చేసి శవాన్ని పూడ్చి పెట్టాడు. తన కూతురు కనపించటం లేదని తల్లి లక్ష్మీదేవి గత నెల 27న డోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సిద్ధూను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా హత్య చేశానని అంగీకరించాడు. నిందితుడిని ఆదివారం సంఘటనా స్థలానికి తీసువెళ్లిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
…
