అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం కొనసాగుతోంది.. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ వివరించారు. బీసీల అభివృద్ధికి సంబంధించి.. ఆయా వర్గాల నుంచి చాలా డిమాండ్లు, వినతులు వస్తున్నాయని తెలిపారు. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలన్న డిమాండ్ ఉందన్నారు. బీసీల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. బీసీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.బీసీల అభ్యున్నతి కోసం ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. బీసీల జీవన ప్రమాణాలు మరింత పెరగాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు రాజకీయాలకతీతంగా అన్ని కులాల అభిప్రాయాలు తీసుకుని ఏం చేయాలో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని సీఎం సూచించారు.
బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఎలా పని చేయాలో, స్వయం ఉపాధి పథకాల స్వరూపం ఎలా ఉండాలో సూచించాలని సీఎం కోరారు.దేశంలో విధానపరమైన స్థిరత్వం లేకపోవడమే ప్రధాన లోపమని సీఎం అన్నారు. బీసీల కోసం పకడ్బందీగా పథకాలు, విధానాలు రూపొందించాలని ఆయన సూచించారు. గురుకులాల్లో 91,520 మంది బీసీ పిల్లలకు అత్యున్నత విద్య అందుతోందని కేసీఆర్ గుర్తు చేశారు.బీసీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు