ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. తాజాగా చంద్రబాబు కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటున్నారనే వార్తలు మీడియాలో జోరందుకున్నాయి. దీంతో తాజాగా విమర్శలు జోరు కూడా అంతే రేంజ్‌లో ఊపందుకుంది. విషయంలోకి వెళ్తే.. 2014లో బీజేపీ-టీడీపీలు సంయుక్తంగా జట్టుకట్టి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా బాబు కేంద్రంలో రెండు మంత్రి పదవులు పొంది.. రాష్ట్రంలో రెండు పదవులను బీజేపీకి కట్టబెట్టారు. దీంతో మిత్రం బంధం పటిష్టంగా ముందుకు సాగుతోందని అందరూ అనుకున్నారు.
ఈ సమయంలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి తగిన విధంగా సాయం అందక పోయినా కూడా చంద్రబాబు మెతకవైఖరినే అవలంబించారు. కేంద్రంతో మనం మిత్ర పక్షంగా ఉన్నాం కాబట్టి తెగేదాకా విషయాన్నిలాగకూడదని బాబు భావించారు. అదే విషయాన్ని చెబుతూ వచ్చారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరి అందరినీ నిశ్చేష్టులను చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని ఎన్నికల సమయంలో పేర్కొన్న చంద్రబాబు ఆ తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితో దీని నుంచి వెనక్కి తగ్గారు. హోదా ఏమన్నా సంజీవనా అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి హోదా వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయనేది మేధావులు, సామాజిక ఉద్యమకారులు, విద్యావంతుల మాట! అయిన ప్పటికీ చంద్రబాబు కేంద్రం నుంచి పెరిగిన ఒత్తిడితో దాదాని తుంగలో తొక్కారు.
ఇక అదే సమయంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రానికి భారీ ఎత్తున భజన చేశారు. హోదా అన్న మాట లేకుండా కేంద్రం.. ప్యాకేజీ రూపంలో రాష్ట్రానికి అన్నీ ఇస్తున్నప్పుడు వ్యతిరేకించడం సమంజసమా అని ప్రశ్నించారు. మొత్తానికి జనాల్ని హోదా నుంచి దారి మళ్లించారు. ఇక, ఇప్పుడు పోలవరం అంశం తెరమీదకి వచ్చింది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుకూలంగా వ్యవహరించకుండా రాష్ట్రంతో వ్యతిరేకత మూటకట్టుకుంది. కేంద్రం నుంచి సకాలంలో రావాల్సిన నిధులు నేటికీ రాక… పనులు మూలన పడే పరిస్థితి దాపురించింది. పోనీ రాష్ట్ర ప్రభుత్వమే చొరవ దీసుకుని ఖర్చు పెట్టినా ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రావడం లేదు.
తాజాగా పోలవరం టెండర్లకు బ్రేక్ వేయాలంటూ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి. దీనిలో భాగంగా కాఫర్ డ్యాం పనులు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ చంద్రబాబు. కేంద్రపై ఉద్యమానికి రెడీ అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. అంటే.. పోలవరం విషయంలో ఏమాత్రం తాత్సారం జరిగినా… ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు పడినా.. తాము ఉపేక్షించేది లేదని బాబు హెచ్చరిక జారీ చేశారు. కేంద్రానికో దండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్య.. తాజాగా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఇక్కడే మరికొందరు విమర్శలు సంధిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడిపోయిన చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు అంత సీరియస్‌గా తీసుకున్నారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. హోదాతో నిరుద్యోగం పోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రాష్ట్రం గుర్తింపు తెచ్చుకునేదని అంటున్నారు. ఇక ఇప్పుడు పోలవరం బాబు ప్రేమ వెనక చాలా వ్యవహారమే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.