ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ నెల 31 లోగా ఏపీ డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం (డిసెంబర్ 1) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో 9259 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని సీనియర్ న్యాయవాది ఏకే గుప్తా కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తున్నామని 2018 జులై లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది.