హైదరాబాద్ మెట్రో రైలు అలా మొదలైందో..లేదో ఇలా బాంబు బెదిరింపులొచ్చాయ్. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.బాంబు స్క్వాడ్ వెంటనే స్టేషన్‌కు చేరుకుంది. తనిఖీలు చేపట్టింది. ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికుల మధ్యే బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
అయితే తనిఖీల్లో భాగంగా.. స్టేషన్‌లో ఓ గుర్తు తెలియని బ్యాగ్‌ను గుర్తించారు. బ్యాగ్‌ను సోదా చేయగా అందులో ఏమీ లేదు. దీనితో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్ మెట్రో స్టేషన్‌కు చెందిన సెక్యూరిటీ సిబ్బందికి చెందినదిగా గుర్తించి అప్పగించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తనిఖీలు చేస్తున్నామని, ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అయ్యుంటుందని భావిస్తూనే ముందు జాగ్రత్తగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.