హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల బాలికను తల్లి, ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి చైల్డ్‌లైన్ సంస్థకు అప్పగించారు.
ఇక చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టిన తల్లి లలితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లలితకు వివాహమై రూప అనే నాలుగేళ్ల కూతురు ఉంది. అదే జిల్లాకు చెందిన ప్రకాశ్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండటంతో కొన్ని నెలల క్రితం పారిపోయి హైదరాబాద్ చేరుకున్నారు. భార్యాభర్తలమని చెప్పి ఎస్ఆర్ నగర్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో మకాం పెట్టారు. సమీపంలోని ఓ హాస్టల్లో లలిత వంట మనిషిగా, ప్రకాశ్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి అక్రమ సంబంధం కారణంగానే చిన్నారిని వదిలించుకునేందుకు ఆమె ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.